భర్తను హతమార్చిన భార్య
-
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
పాపన్నపేట(మెదక్): కుటుంబ కలహాలతో భార్య భర్తను అంతమొందించిన దారుణ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది. తండావాసులు, ఏఎస్సై తుక్కయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన మాలోత్ కిషన్ (60) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఏడాదిగా ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో కిషన్ కొంతకాలం విడిగా ఉన్నాడు. ఇటీవల మళ్లీ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నప్పటికీ, తరచూ మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు.
సోమవారం రాత్రి కిషన్ మద్యం మత్తులో ఇంటికి రావడంతో భార్య మాలి, కొడుకు వినోద్‌తో గొడవ జరిగింది. ఈ క్రమంలో కిషన్‌ను వదిలించుకోవాలని భావించిన భార్యా, కొడుకు అతడిపై దాడి చేశారు. మాలి కాళ్లు గట్టిగా పట్టుకోగా, వినోద్ గొంతు నులిమి కిషన్‌ను హత్య చేశాడు. అనంతరం దీనిని ఆత్మహత్యగా నమ్మించేందుకు మృతదేహాన్ని ఇంటి ముందున్న నీటి తొట్టిలో పడేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా అసలు నిజం బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తె లీలావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0