ఉగ్రవాదానికి తలొగ్గే ప్రస్తకే లేదు

Apr 23, 2026 - 11:45
 0  1
ఉగ్రవాదానికి తలొగ్గే ప్రస్తకే లేదు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: ఉగ్రవాదం ముందు భారతదేశం తలొగ్గే ప్రసక్తే లేదని, ఉగ్రవాదులు ఏ రూపంలో వచ్చినా బదులు చెప్పి తీరుతామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి బుధవారానికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో నాటి దాడిలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర మంత్రులు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, వివిధ పార్టీల నేతలు బుధవారం నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు తమ సానుభూతి తెలియజేశారు. 2025 ఏప్రిల్‌ 22న పహల్గాంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిని ప్రపంచమంతా తీవ్రం గా ఖండించింది. అనంతరం భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టి పాక్‌లో ఉన్న ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటానికి తామంతా కట్టుబడి ఉన్నామని, దేశానికి వ్యతిరేకంగా జరిగే ఎలాంటి చర్యకైనా బదులు చెప్పి తీరుతామని భారత సైన్యం స్పష్టం చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగుతోందని రాసి ఉన్న ఓ డిజిటల్‌ పోస్టర్‌ను ఆర్మీ ఎక్స్‌ లో పోస్టు చేసింది. మరోవైపు.. పహల్గాం ఉగ్రదాడికి ఏడా ది పూర్తయిన సందర్భంలో ఇజ్రాయెల్‌ కూడా స్పందించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటున్నామని, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని ఇజ్రాయెల్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గిడియాన్‌ సార్‌ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేసే పోరాటానికి ఇజ్రాయెల్‌ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజర్‌ కూడా పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ’

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0